Wednesday, September 15, 2010

తెలుగు వెలుగులేవి?(telugu velugulevi?)

 ఏభాషా అంత తేలికగా వాగ్వ్యవహారం నుంచి జారిపోదు. సువ్యవస్థితమైన భాష ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందో, అంతకంటే ఎక్కువ కాలమే జన వ్యవహారం నుంచి భాష మృగ్యమైపోవడానికి పడుతుంది. ఈ దశలో పతనం కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. నేడు మన తెలుగు భాష దుస్థితికి కారణాలేమిటి?

మాతృభాషాభిమానం నేడు తెలుగును అధ్యయనం చేసేవారికీ, బోధించేవారికే పరిమితమైపోయింది. అలా కాకుండా రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు 'నాదు దేశము నాదు జాతి నాదు భాష' అనే అభిమానం ఉండా లి. తెలుగు మాతృభాషగా కల ప్రతి ఒక్కరికీ భాషాభిమా నం ఉండాలి. తోటి తెలుగువానితో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి.

తెలుగు పట్ల అభిమానం పిల్లల్లో ప్రాథమిక స్థాయి నుంచే అలవడేలా చేయాలి. భాషపై అభిమానం ఏర్పడితే పాఠ్యాంశాలలో తెలుగు లేకపోయినా స్వీయకృషితో తెలుగు భాషా సాహిత్యాలపై పట్టు సాధించగలుగుతారు.

ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే ఆంగ్లంలో మాట్లాడుకుంటారని ఒక ఛలోక్తి ఉంది. ఇది మనకు మన భాష పట్ల గల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది.

అసలు ఏ భాష అయినా మొదట వాగ్రూపంలో ఉంటుంది. మాట్లాడే భాష నుంచి లిఖిత భాష ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ లిఖిత భాష ప్రభావం మౌఖిక భాషపై కూడా ఉంటుంది. ఈ రెండూ పరస్పరాశ్రితాలు. అలాగే మాట్లాడే భాషలో తెలుగుతనం తగ్గిపోతూ ఉండడం వల్ల క్రమంగా లిఖిత భాష కూడా ప్రభావితం అవుతుంది. అందువల్ల ముందు మౌఖిక భాషను సంరక్షించుకోవాలి. దీనికి స్పష్టమైన నిర్దిష్టమైన ఉచ్ఛారణను విధిగా అందరూ పాటించాలి.

ముఖ్యంగా భాషను ప్రాథమిక స్థాయిలో బోధించే అధ్యాపకుల నియామకంలో స్పష్టోచ్ఛారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాథమిక విద్యా బోధకులలో భాషా పండితు లు ఉండడం లేదు. తెలుగును ప్రత్యేక పాఠ్యాంశంగా చదివినవారిని ప్రాథమిక స్థాయిలో అధ్యాపకులుగా నియమించాలి.

అలా నియమితులైన వారే పిల్లలకు మంచి భాషను చిన్నప్పటి నుంచీ నేర్పడమేకాక, భాషాభిమానా న్ని కలిగించేందుకు కీలకపాత్రను పోషిస్తారు. ప్రాంతీయ మాండలిక భాషా జ్ఞానం అందరికీ తప్పనిసరి.

ఈ జ్ఞానం తో పాటుగా ప్రామాణికాంధ్ర భాషాస్వరూపాన్ని స్పష్టం గా చిన్నప్పటినుంచీ పిల్లలకు తెలియజెప్పాలి. వివిధ మాండలికాలు వాటి వ్యాప్తి, శబ్ద సాధు-అసాధువులు, ఉచ్ఛారణ విషయంలో సందేహాలు పిల్లవాడి భాషా వినియోగానికి ప్రతిబంధకాలుగా తయారవుతాయి.

ఈ సందేహాలను నివారించడానికి చిన్ననాటి నుంచి ప్రామాణిక గ్రంథాలను పాఠ్యాంశాలుగా బోధించడమే శరణ్యం. రేడియో, టీవీ వంటి ప్రసార మాధ్యమాల ప్రభావం ప్రజలపై ఎంతగా ఉందో చెప్పనవసరం లేదు. కనుక సరైన ఉచ్ఛారణను అందించే భాషా నిపుణుల్ని రేడియో టీవీల లో నియమించాలి. సాధారణంగా పాత్రికేయ నైపుణ్యా లు ఉన్న వారినే వ్యాఖ్యాతలుగా నియమిస్తున్నారు. దీనివల్ల భాష దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే నేడు తెలుగుభాషకు దిక్కు పత్రికలే. పత్రికలు దోషరహిత ప్రయోగాలను చిత్తశుద్ధితో వాడితే వాటి వ్యాప్తి వేగంగా ఉంటుంది. భాషా పాండిత్యం లేని పాత్రికేయులు కొన్నికొన్ని అపప్రయోగాలను, దుష్టపదబంధాలను రూపొందించి భాషకు తీరని అన్యాయం చేస్తున్నారు. పద, వాక్యస్థాయి దోషాలపై 'నిఘా' యంత్రాంగం పటిష్టమైన తీరులో అన్ని పత్రికల కు పనిచేయాలి.

అలాగే తెలుగు భాషలో మృగ్యమైపోతు న్న పద ప్రయోగ వ్యాప్తిని పెంచాలంటే ముందుగా ఆంగ్ల భాషా వ్యవహారాన్ని సాధ్యమయినంత వరకు కట్టడి చేయాలి. ఇది చాలా కష్టమైన విషయం.

ఎందుకంటే ఆధునిక కాలంలో శాస్త్రసాంకేతిక రంగాలలోనూ విద్యా వాణిజ్యాది రంగాలలోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఈ మార్పు ప్రజల జీవనం, సంస్కృతి, భాషలపై ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తుం ది.

తెలుగు భాషా సంస్కృతులకు సంబంధంలేని కొత్తకొత్త కొలువులు ప్రవేశిస్తున్నాయి. దీంతో తెలుగు భాషలో ఆయా కొలువులకు చెందిన పారిభాషిక పదాలను ఆంగ్లం నుంచే స్వీకరించవలసిన అనివార్య స్థితి ఏర్పడుతోంది.

ఇది ఎప్పుడూ సమస్యే. సాంస్కృతికంగా సంస్కృత భాష, పాలనాపరంగా అరబిక్ భాష, శాస్త్రసాంకేతిక పరంగా ఇప్పుడు ఆంగ్ల భాష అసంఖ్యాక పదాలను తెలు గు భాషకు అందించాయి. ఈ ప్రభావం క్రమంగా నిత్య వ్యవహారానికి కూడా వ్యాపించి, వర్ణ, పద, వాక్య స్థాయిలలో తెలుగు వాడకం తగ్గిపోతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యాకరణం తెలుగులో ఉంటుంది. పదాలన్నీ ఆంగ్ల భాషవే ఉంటాయి. దీనికి పరిష్కారం అన్య దేశాల కు బదులు స్వీయభాషలో పద నిర్మాణం జరగాలి.

అన్యదేశాలు వాడితే తప్పేం టి? ఇదొక ప్రశ్న. అన్య దేశ్యాలను వాడితే పద సంపద పెరిగి భాష విస్తృతమౌతుంది. మంచిదే. కానీ ఈ వాడుక తెలుగుభాషలోని ప్రాథమిక పదజాలాన్ని దెబ్బతీయకూడదు. వాక్యాలపై ఈ ప్రభా వం అధికంగా పడుతుంది. తద్వా రా తెలుగుభాషకు సహజం కాని వాక్యాలు తెలుగులో చోటు చేసుకొని గందరగోళం సృష్టిస్తాయి.

అలాగే మౌలికమైన తెలుగు క్రియ లు మరుగున పడిపోయి, వాటి స్థానంలో ఆంగ్ల క్రియలే వ్యాప్తిలోనికి వస్తున్నాయి. మౌలిక క్రియలు వ్యవహారంలోంచి జారిపోవడం పెద్ద ప్రమాదం. ఎందుకంటే అస లు భాషలోని పదాలన్నీ క్రియలనుంచే ఉద్భవిస్తాయనే వాదం ఒకటి ఉంది.

చాలా తెలుగు పదాలకు మూలాలు నేటికీ తెలియడం లేదు. ఈ విషయంపై నామవిజ్ఞాన శాస్త్రం కొంత కృషిచేస్తోంది. అసలు క్రియలే ఎవరికీ తెలియకపోతే భాషా, సాంస్కృతిక, సామాజిక మూలాలు తెలుసుకోవడం కుదరనిపని. అందువల్ల సాధ్యమయినంతవరకు నూతన పదాలను కల్పించాలి.

మొండిగా తెలుగువాడకూడదు. కృతకంగా ఉంటే అన్యదేశ్యాన్నే స్వీకరించాలి. భాషాపరిరక్షణ విధి వ్యక్తాకరణను బాధించేదిగా ఉండకూడదుకదా! ఇది ప్ర«ధాన భాషానియమం. ఉదాహరణకు తమిళులు ప్రాణవాయువును 'పిరాణ వాయు వు' అంటారు. ఇది తద్భవరూపం. అయినా దీనికి 'ఉయిర్‌కాట్రు' అనే ఆచ్ఛిక పద ం కల్పించారు.

ఆంగ్ల పారిభాషిక పదాలకు దీటుగా నూతన పద నిర్మాణం చేయవలసిన అవసరం ప్రధానంగా రెండు విధాలుగా కన్పిస్తుంది. ఒకటి సాంకేతిక తెలుగు భాషా వ్యవహారం. రెండు సాధారణ భాషా వ్యవహారం. సాంకేతిక పదాలను సృష్టించడానికి తత్సమ పదాలనే ఎక్కువగా వాడడం వ్యాప్తిలో ఉంది. ఇలా తయారు చేసిన వాటికంటే ఆంగ్ల పదాలే సులభంగా ఉంటాయనే విమర్శ కూడా ఉంది. శాస్త్రం ఎప్పుడూ బుద్ధిగ్రాహ్యమే. సులభం గా ఉండదు.

అందువల్ల క్లిష్టమైనా తప్పనిసరిగా తెలుగు పదాలనే వాడాలి. ఇవి స్వల్ప సంఖ్యాకులకే అర్థం కావ డం వల్ల ఇబ్బంది లేదు. ఇక సామాన్య జనుల వాగ్వ్యవహారం నుంచి భాషను రక్షించుకోవాలి.

దీని కోసమే పత్రికలు , మీడియా, మేధావులు, రచయితలు కృషి చేయాలి.

నిత్య వ్యవహారంలో బంధువు లపేర్లు, శరీరభాగాల పేర్లు, ఆహారాల పేర్లు , కూరగాయల పేర్లు, పప్పుదినుసుల పేర్లు... ఇలా చెప్పుకొంటూ పోతే నిరక్షరాస్యులు సైతం తెలుగుకు మారు గా ఆంగ్ల పదాలనే వాడుతున్నా రు. 'గ్యాస్ స్టవ్' రావడంతో కుం పటి, పొయ్య గొట్టం పదాలు వాడుకను కోల్పోయాయి. 'గ్యాసు పొయ్యి' పదం స్థిరపడిం ది.

దీనిని 'గాలికుంపటి' అని వ్యవహరించవచ్చు. పనిముట్ల వాడకం తగ్గిపోయింది. ఇళ్ళు, ఆటపాటలు, వైద్యం వంటి వాటిలో వచ్చిన మార్పుల వల్ల తెలుగు పదాల వాడుక కన్పించడం లేదు. 'షాపింగ్ మాల్స్' వచ్చాక అందులోని వస్తువులపై పేర్లుకూడా ఆంగ్లంలోనే ముద్రిస్తున్నారు.

ఈ దెబ్బకి నుడికార పు నాడి దొరకడం లేదు. ఇక భాష సంగతి వేరే చెప్పా లా?! జనవ్యవహారంలో సహజసిద్ధంగా పుట్టే పదాలను వాడుకలోనికి తేవాలి. విశాఖవాసులు 'డ్రెడ్జర్'ను 'తవ్వో డ' అని, సబ్ మెరైన్‌ను 'దొంగోడ' అనీ అంటారు.

ఇవి ఎంత సహజసిద్ధమైన పద కల్పనలో చూడండి. అలాగే లంచం తీసుకోవడం అనే మాటకు తెలుగులో 30కిపైగా నుడికారాలున్నాయి. ఇటువంటి వాటిని వెలుగులోనికి తేవాలి.

పత్రికలు కూడా తెలుగు అనువాదాలు కల ఆంగ్ల పదాలను త్యజించి తెలుగు పదాలనే విధిగా వాడాలి. అసెంబ్లీ-శాసనసభ; కోర్టు-న్యాయస్థానం; ఆర్గానిక్ ఫార్మింగ్- సేంద్రియ వ్యవసాయం; వాటర్ షెడ్స్-వాలుగట్లు; చెక్ డ్యాం-వరదకట్ట మొదలయిన సమానార్థక పద సృష్టిపై తెలుగులో పత్రికలు మొదట బాగా కృషి చేశాయి. కొన్ని మార్గనిర్దేశక సూత్రాలనుకూడా ఏర్పరచుకున్నాయి. అనవసరంగా ఆంగ్ల పదాన్ని వాడకూడదు.

ముఖ్యంగా శీర్షికలలో ఇంగ్లీషు మాటల్ని త్యజించాలి. ఆంగ్ల పదాలకు సమానానార్థకాలను వాడడానికి కొన్ని సూచనలు కూడా పూర్వ పాత్రికేయులు చేశారు.

అవి: ఉన్న మాటలనే పరిమితార్థంలో వాడటం; ఉన్న మాటకు కొత్త అర్థాలు కల్పించటం; కొత్త పదాల సృష్టి; భాషానువాదం; యథానువాదం. అర్థబోధక శక్తి ఉన్న రూపాలు వ్యాకరణ విరుద్ధాలయినా వాడటమే మంచిది. సరళీకర ణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ మొదలయినవి ఇందుకు ఉదాహరణలు.

నూతన పద నిర్మాణం కోసం తమిళులు చేసే కృషి మనకు ఆదర్శం కావాలి. నేటికీ ఆంగ్ల పత్రికలలో వచ్చే పారిభాషిక పదాలకు సమానార్థకాలను కల్పించి ఎప్పటికప్పుడు ఆకాశవాణి ద్వారా ప్రసారం చేస్తున్నారు. అలాగే హిందీ, కన్నడ భాషా పత్రికలు ఇంగ్లీషు భాషా వ్యవహారాన్ని పూర్తిగా తగ్గించాయి. వీరందరూ మనకి ఆదర్శం కావాలి.

బుద్ధికి పదునుపెడితే స్థిరంగా వ్యవహారానికి వచ్చే చక్కని పదాలను ఆంగ్ల పదాలకు మారుగా సృష్టించవచ్చు. కాశీనాథుని నాగేశ్వరరావు నైట్రోజన్‌కు నత్రజ ని, నికెల్‌కు నిఖిలము, ఆక్సిజన్‌కు ప్రాణవాయువు, ఫోటోసింథసిస్‌కు కిరణజన్య సంయోగక్రియ వంటి పదా లు సృష్టించారు.

ఇవి ఎంతగా ప్రసిద్ధి పొందాయో చెప్పనక్కర్లేదు కదా. భాష ఎప్పటికప్పుడు పరిష్కరణలు చేసుకోవడం వల్లనే విస్తృతమౌతుంది. ఆంగ్ల వ్యాప్తికి కారణం కూడా ఇదే. ఈ పరిష్కరణ ప్రక్రియ తెలుగు భాషకు అత్యంతావశ్యకం. పరిశోధనాత్మక అధ్యయనం ద్వారా పరిష్కరణ పదస్థాయిలోనూ, వాక్యస్థాయిలోనూ జరగా లి. నూతన పదనిర్మాణం ద్వారా తెలుగు భాషా వినియోగాన్ని పెంచడానికి ఒక్క ప్రయత్నలోపం తప్ప వేరేమీ కన్పించదు.

నిత్య వ్యవహారంలోనూ తెలుగును విస్మరించకూడదని, విద్యాబోధనలోనూ, అభ్యాసంలోనూ తెలు గు ప్రత్యేక పాఠ్యాంశంగా ఉండాలని, ప్రతి తెలుగు వాడూ భావించాలి. దీనికోసం భాషా సంఘాలు, సాహి తీ సంస్థలు, కవులు, రచయితలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. వివిధ చైతన్య సభల ద్వారా తెలుగు వైభవాన్ని చాటి చెప్పాలి. దీనికి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే తెలుగు దివ్వె ప్రతి ఇంటా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.

-అద్దంకి శ్రీనివాస్
(వ్యాసకర్త హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులు)

1 comment:

  1. FIGHT FOR IT just seen ur blog nice call me see facebook for my details regards damodhar
    తమిళులు ఇప్పటికి పది అ0తర్జాతీయ తమిళ సా0కేతిక మహాసభలను వివిధ దేశాలలొ నిర్వహి0చారు. మన0 వారికన్నా పది ఏళ్ళు ఆలస్య0గానే ఈ యాత్రని ప్రార0భిస్తున్నా0. ఇ0దులో నిరాశ చె0దవలసిన దేమీలేదు.
    http://prachinatelugu.blogspot.com/2012/01/dig-our-telugu-heritage-wealth.html

    ReplyDelete