Wednesday, September 15, 2010

తెలుగులో తొలి రచన

సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణమైతే తెలుగులో తొలి ఇతిహాసం భారతం. నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతమే తెలుగులో తొలి ఇతిహాసం. నన్నయకి ‘ఆదికవి’ అనే బిరుదు అనంతరకాలంలో వచ్చిందే. మారన ‘‘ఆంధ్ర కవితా గురుడు’’ అన్నాడు. తిక్కన ‘‘ఆంధ్ర కవిత్వ విశారదుడు’’ అనీ, రామరాజ భూషణుడు ‘వాగశాసనుడు’ అనీ మాత్రమే నన్నయను స్తుతించారు. ఇతిహాసాన్ని తెలుగులో రాయడానికి రాజరాజ నరేంద్రుడే కారకుడు. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొన్న కాలంలో ‘శాంతి’ ఏర్పడింది. అప్పుడు నన్నయ చేత వ్యాసభారతాన్ని ‘తెనుగున’ రచియింపజేశాడు. మరికొందరు కవులున్నా నన్నయనే పిలిచి రాయించటంలో ఆంతర్యం ఏమిటంటే- నన్నయ తన కుల బ్రాహ్మణుడు, అనురక్తుడు, విపులశబ్ద శాసనుడు, సంహితాభ్యాసుడు, లోకజ్ఞుడు, ఉభయ భాషా కావ్య రచనా శోభితుడు, నిత్య సత్య వచనుడు... వంటి సుగుణాలూ యోగ్యతలూ కలవాడు కావడమే! నన్నయ తెలుగులో ఇతిహాస రచనకి, కావ్యశైలికి, అనువాద ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు. రాజరాజు భారతం రాయించటంలో వ్యక్తిగతమైన అభిరుచులు ఉంటే ఉండవచ్చు కానీ తెలుగులో నన్నయ భారతం రావటానికి- ఆ తర్వాత కవిత్రయ భారతం రావటానికి కారకుడైన రాజరాజును తెలుగుజాతి సదా స్మరించవల్సిందే. నన్నయ అనువాద రచనకి ఒరవడి పెట్టాడు. యథానువాదం సరికాదని ప్రకటించాడు. మూలానికి సొంత ప్రతిభను జోడించి చేర్పులూ, మార్పులూ చేసి అనువాదంగా కాకుండా ‘అనుసృజన’గా రాయటం ఎలాగో చూపించాడు. తర్వాతి కవులకి మార్గం చూపించాడు. నన్నయ తన కవితా రీతుల్ని ప్రకటించి దీనికి కూడా మార్గదర్శకుడయ్యాడు. అప్పటినుంచి తిలక్ వరకూ చాలామంది తమ కవితా తత్త్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. బహుభాషా కోవిదుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరణగా కాకుండా కొత్తగా రాస్తున్నట్టు రచించాడు. అందుకే విమర్శకులు నన్నయ మూలానికి మెరుగుపెట్టాడు. నగిషీ చెక్కాడు, వనె్న పెట్టాడు అన్నారు. వ్యాసుని కథకి, వ్యాసుని పాత్రలకి తెలుగుదనాన్ని అద్దాడు. అందుకే కొలని గణపతిదేవుడు ‘శివయోగసారము’లో నన్నయను ‘‘ఆంధ్ర కావ్య పథము తీర్చినవాడు’’గా ప్రశంసించాడు. నన్నయ రాసింది రెండున్నర పర్వాలే అయినా తెలుగుజాతి ఉన్నంతవరకు జీవించే వుంటాడు.

No comments:

Post a Comment