Thursday, September 16, 2010

తొలి వచనములు(first prose in telugu)

ప్రథమాంధ్ర వచన వాజ్ఞయాచార్యుడిగా ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన కృష్ణమాచార్యులు కాలాన్ని కొందరు క్రీ.శ.1290 ప్రాంతంగా, మరికొందరు 1260-65 ప్రాంతంగా భావించారు. ఆంధ్ర రచయితల సంఘం పక్షాన ఆచార్య ఎం.కులశేఖరరావుగారు ‘సింహగిరి వచనములు’ పేర కొన్నిటిని సేకరించి ప్రచురించి ఎంతో మంచిపని చేసారు. ఆ తర్వాత సింహాచలం దేవస్థానం వారు వచనములు, కృష్ణమాచార్య సంకీర్తనము, సింహగిరి నరహరి వచనములు అనే భాగాలతో ప్రచురించారు. ‘చాతుర్లక్షగ్రంథ సంకీర్తన వాక్పూజలతో శ్రీ సింహాద్రి నాథుణ్ణి మెప్పించి ప్రత్యక్షం కావించుకున్న మహాభక్త శిఖామణి’’గా ప్రశంసించబడ్డాడు. కృష్ణమాచార్యులు అటు పద్య పద్ధతినీ ఇటు చంపూ పద్ధతినే కాకుండా వచన శైలిలో కవితా గానం చేసి ఆద్యుడయ్యాడు. ఇతని రచనను ‘తొలి వచన గేయాలు’గా కూడా పేర్కొన్నారు.
ఇప్పటివరకు అచ్చు అయిన సింహగిరి వచనాలు అరవై వున్నాయి. ప్రతి వచనం ‘దేవా!’ అనే సంభోదనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు.
‘‘వేదంబు తెనుగు గావించి సంసార/ఖేదంబుమాన్చిన కృష్ణమాచార్య’’ అనే ప్రశస్తి పొందాడు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. ఇతని ప్రభావం బమ్మెర పోతనపై వుందంటారు. తాళ్లపాక వారి కీర్తన వాజ్ఞయానికి ప్రేరణ, స్పూర్తి కృష్ణమాచార్యుల వచనాలే అంటారు.
‘‘దేవాతనువుల మాయ/తలపోసి తలపోసి చెప్పెదనంటినా
కఱకఱల మోహమిది! ఆశల పాషాణంబిది/అతుకలు జల్లెడయిది....
....నాటకములాడెడు బూటకమ్ముల బొమ్మ/అమ్మమ్మా రుూ బొమ్మ’’
అంటూ సాగే వచనాలతో దేశ్య పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం. ‘‘రణించు-జోడించు-తుండించు’’ వంటి విశిష్ట ఇంచుక్కు రూపాలు చూస్తాం. ‘‘విదురనాటి వాదా’’, ‘‘ద్వార వాకిళ్లు’’ వంటి ప్రయోగాలు 13వ శతాబ్దంలో చెయ్యడం విశేషం. కృష్ణమాచార్య వచనాలను నామసంకీర్తనా వచనాలు, పౌరాణిక వచనాలు, కథా వచనాలు సాంప్రదాయ వచనాలు...అనేవిధంగా విభజించవచ్చు. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడే!

No comments:

Post a Comment