Friday, September 17, 2010

తొలి శతకం(first satakam in telugu)

తెలుగులో తొలి శతకమేది? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే. కొందరు మల్లికార్జున పండితారాధ్యుడనే శివ కవి రాసిన ‘శివతత్త్వసారము’ తొలి శతకమన్నారు. అజా, రుద్రా, శివా అనే మకుటాలతో 489 పద్యాలుగల రచన ఇది. ‘‘శతకమనుపేరు లేకున్నను శివతత్త్వసారమునందలి పద్యములు సర్వ విధముల శతకములనే పోలియున్నవి’’ అని అంచనావేసారు ఆచార్య జి.నాగయ్య. కానీ నిడదవోలు వెంకటరావు ‘‘తెలుగున తొలి శతకము మల్లికార్జున పండితారాధ్యుని శ్రీగిరి మల్లికార్జున శతకము. దీని మకుటము శ్రీగిరి మల్లికార్జున’’ అని వెల్లడించారు. అయితే శ్రీగిరి శతకంలో కొన్ని పద్యాలు తప్ప శతకం లభ్యం కాలేదు. అదే నిడదవోలు వృషాధిప శతక పీఠిక రాస్తూ ‘‘ఆంధ్ర శతక వాజ్ఞ్మయమున సంఖ్యానియమము, మకుట నియమము గలిగిన శతకములలో ప్రధమము వృషాధిప శతకము’’ అన్నారు. అందువల్ల శతక లక్షణాలు సంపూర్ణంగా కలిగి, లభ్యమైన వృషాధిప శతకమే తెలుగులో తొలి శతకంగా పేర్కొనబడుతోంది.
పనె్నండవ శతాబ్దికి చెందిన పాల్కురికి సోమనది తెలంగాణలో ‘పాలకుర్తి’గా చెప్పబడుతోంది. ఇతను వీరశైవాన్ని ఆచరించిన వాడు. ‘శివకులీనుడు’ అని చెప్పుకున్నాడు. మూర్త్భీవించిన శివభక్తి స్వరూపమే పాల్కురికి సోమన. ‘‘తెలుగు మాటనంగ వలదు, వేదముల కొలదియగా’’ చూడుడని తెలుగు అభిమానాన్ని అప్పుడు చాటి చెప్పిన తొలి కవి. వృషాధిప శతకం బసవని స్తుతిరూపకమైన శతకం. వీర శైవ మత స్థాపకుడైన బసవుడంటే సోమనకి సాక్షాత్తు శివుడే.
‘‘నా యొడయుండ, నా విభుడ, నా హృదయేశ్వర, నా మనోరమా
నా యిలవేల్ప, నా వరద, నా గురులింగమ, నాదు జంగమా
నాయధినాథ, నావరుడ, నన్ను కృపామతి బ్రోవుమయ్య దే
వా. యమ బృంద వంద్య బసవా బసవా బసవా వృషాధిపా!’’
ఈ వృషాధిప శతకంలో అనుప్రాస గల పద్యాలున్నాయి. ఏక సమాసంతో కూడిన పద్యాలున్నాయి. నమస్కారాంత (నమో నమో అంటూ) పద్యాలూ వున్నాయి. సంస్కృతం, తమిళం, కన్నడం, ఆరె భాషలలో పద్యాలు రాసాడు. మణిప్రవాళ శైలిలో (సంస్కృతాంధ్ర పదాలను కలుపుతూ) రాసిన తొలి కవి కూడా సోమనే. బసవుని మహిమల్నే కాకుండా సామాన్యులైన శివభక్తుల చరిత్రను కూడా వివరించాడు. చంపక, ఉత్పలమాల పద్యాలతో రాయబడిన వృషాధిప శతకం భక్తి శతకాలలో అగ్రస్థానంలో నిలుస్తుంది.

No comments:

Post a Comment