Thursday, September 16, 2010

తొలి వ్యాకరణ గ్రంథం(first book on telugu grammar)

తెలుగులో కంటే ముందుగా తమిళ, కన్నడ భాషలలో వ్యాకరణాల రాయబడ్డాయి. పదకొండవ శతాబ్దం వరకు తెలుగు భాషకి వ్యాకరణాలు వెలువడలేదు (ఎవరన్నా రాసినా దొరకలేదు). మన వాజ్ఞ్మయపు తొలినాళ్లలో అన్నీ వివాదాస్పదమైనవే. అలాగే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథ కర్తృత్వం కూడా వివాదాస్పదమైనా చాలామంది నన్నయ రాసాడని భావించారు. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ తెలుగు భాషకు రాయబడిన మొదటి వ్యాకరణమే కానీ-సంస్కృతంలో రాయబడింది. ఇందులోని సూత్రాలు, ఆర్యావృత్తములు ఇంచుమించు 270 వున్నాయి. ఆంధ్ర శబ్ద చింతామణికి నన్నయభట్టీయము, వాగనుశాసనీయము, శబ్దాను శాసనము అనే పేర్లున్నాయి. నన్నయ శబ్ద శాసనుడు, వాగనుశాసనుడు అని ప్రసిద్ధి పొందడానికి ఈ వ్యాకరణమే కారణం. ఆంధ్ర శబ్ద చింతామణిలో సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ అనే అయిదు పరిచ్ఛేదాలున్నాయి. ఛందోబద్ధత ఆ రోజుల్లో నిత్యం కాబట్టి శ్లోకాలలో వ్యాకరణ సూత్రాలు రాయటం అప్పటి రచనా పద్ధతి కాబట్టి నన్నయ కూడా శ్లోకాలలో రాసి వుంటాడు. అయితే ఈ ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు భాషకి సమగ్రమైన వ్యాకరణం ఏమీ కాదు. తత్సమ శబ్ద రూప సాధనకే నన్నయ ప్రాధాన్యమిచ్చాడు. పాణినీయాన్ని అనుసరించినా నన్నయ కొంత కొత్త పరిభాషను కూడా ప్రవేశపెట్టాడు.
‘‘విశ్వశ్రేయః కావ్యమ్’’
అనే మొట్టమొదటి సూత్రమే చాలా ప్రసిద్ధమైంది. నన్నయ కాలంనాటికే కావ్య ప్రయోజనం విశ్వ శ్రేయస్సు అనే భావన వుండడం విస్మరింపరానిది. అలాగే ‘‘స్వస్థాన వేషభాషాభిమతాస్సన్తో రసప్రలుబ్ధ ధియః...’’ అంటూ స్వదేశ వేష భాషాభిమానాన్ని చాటి చెప్పిన వ్యాకరణ గ్రంథం ఇది. అంతేకాదు-
‘‘సిద్ధిర్లోకాద్దృశ్యా’’- ఆంధ్ర శబ్ద స్వరూపం లోక వ్యవహారం వల్లనే సిద్ధిస్తుంది అనడం ఎంతటి ముందు చూపు? ఆంధ్ర భాషకు ముప్పయి ఆరు వర్ణాలని పేర్కొనబడింది. చిన్న సూత్రాలతో చాలావరకు ప్రణాళికాబద్ధంగా రాయబడ్డాయి. బాల వ్యాకరణానికి ఇది ఆధారమంటారు.
‘ప్రతిషే ధవాచినాంనః’- వ్యతిరేకార్ధంలో క్రియా పదాలకు ‘ని’ చేరుకుతుందని అర్ధం. ఉదా: జయింపనివాడు, చేయనివాడు, గెలువనివాడు మొ. కంఠస్థం చేయడానికి అనువుగా వ్యాకరణ పరిజ్ఞానానికి తొలి సోపానంగా ఉపయోగపడే వ్యాకరణమిది.
ఆంధ్ర శబ్ద చింతామణికి, సంస్కృతంలో ఎనిమిది, తెలుగులో పదహారుటీకలు వ్యాఖ్యలు వెలిసాయంటే దీని ప్రాశస్త్యం తెలుస్తుంది. విశేషం ఏమిటంటే సిపి బ్రౌను దొర దీనినీ వదిలిపెట్టలేదు-ఆంగ్లంలోకి అనువదించాడట!!

No comments:

Post a Comment