Friday, September 24, 2010

తెలుగు భాషలో నవలా ప్రక్రియ -- Novel in Telugu Literature




తెలుగు భాషలో నవలా ప్రక్రియ మొదలై నూరు సంవత్సరాలు దాటింది. నవల అనే సాహిత్య ప్రక్రియను మనం పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం. నవల్లో మన తెలుగు నవలా రచయితలపై పాశ్చాత్య రచయితల ప్రభావంతో పాటు వంగ, మహారాష్ట్ర, కన్నడ, ఉర్దూ రచయితల ప్రభావం ఎంతగానో ఉంది. నేడు తెలుగు సాహిత్యంలో ప్రజల గౌరవాదరణలను పొందుతున్న ఏకైక సాహితీ ప్రక్రియ నవల అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
తెలుగునాట నవలా సాహిత్య ప్రక్రియకు నవయుగాంధ్ర సాహిత్య నిర్మాత గద్యతిక్కన బిరుదాంకితుడైన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మూల పురుషుడు. ఆయన 1878 లో వ్రాసిన రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవలగా ప్రసిద్ధికెక్కింది. ఇది సాంఘిక నవల. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర అయితే తొలి చారిత్రక నవల చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి హేమలత. ఇది 1896 వ సంవత్సరంలో వ్రాయబడింది. హేమలత కథ మేవారు రాణా లక్ష్మణ సింగు కాలంలో జరిగినట్టు తెలుస్తుంది. ఈయన చిత్తూరుకు మహారాజు. చిన్న తనంలోనే తండ్రిపోవడంతో అతని పినతండ్రి భీమసింగురాజు అతనికి అండగా నిలిచి రాజ్యపాలన చేస్తాడు. ఇది హేమలత నవలకు ఇతివృత్తం. ఇందులో మొగలాయి రాజ్యంలో జరిగిన అత్యాచారాలను చిలకమర్తి వారు వర్ణించారు. ఢిల్లీ చక్రవర్తి అల్లాయొద్దీన్‌ వీరి రాజ్యంపై దండెత్తుతాడు. ఇందులో కథానాయిక హేమలత 1301 వ సంవత్సరంలో ఈ కథ జరిగినట్లు తెలుస్తున్నది. శ్రీవేరేశలింగం ఏర్పరచిన 'చింతామణి' పత్రిక పోటీలలో అనేక బహుమతలు పొంది ఎన్నో నవలలు వ్రాసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ఇంకా అహల్యాబాయి, కర్పూరమంజరి, మణిమంజరి, కృష్ణవేణి, సువర్ణ గుప్తుడు, శాపము మొదలైన చారిత్రక నవలలదో విశిష్ట స్థానం. అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సాంఘిక నవలలు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వవచ్చు. కాని వాటివల్ల ప్రయోజనం తక్కువ. మనకు స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు కావస్తుంది. మనం భౌతికంగా స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం. కాని మానసికంగా జాతి ఇంకా పరాధీన స్థితిలోనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో జాతికి కావలసింది ఆనందం కాదు. జాతికి స్ఫూర్తినివ్వాలి. అలాంటి ఇతివృత్తాన్ని రచయిత సృష్టించడు. చరిత్రలో జరిగిన సంఘటనలను తీసుకొని పాఠకులకు అర్థమయ్యే విధంగా అందంగా వర్ణన చేస్తాడు. దీని వల్ల పాఠకులకు ఆనందంతో పాటు చరిత్రలో జరిగిన సంఘటనలు తెలుస్తాయి.
చారిత్రక నవలలు రెండు రకాలుగా ఉంటాయి. అవి 1. చరిత్రలో వాస్తవ కథను తీసుకొని వ్రాసినవి ఒక రకం. కొంత వాస్తవాన్ని తీసుకొని దానిపై కల్పనలతో రచించినవి ఇంకో రకం. మొత్తం మీద చారిత్రక నవల అంటే పూర్తి అభూత కల్పనలను అని కాకుండా వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే కల్పనలన్న మాట.
కీ||శె|| కొమర్రాజు వెంకట లక్షణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి తెలుగులో చారిత్రక నవలా రచనలను బాగా ప్రోత్సహించింది. ఇంకా ఆంధ్ర ప్రచారిణి, సరస్వతి, వేగుచుక్క గ్రంధమాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రచురణ సంస్థలు విద్యాలయాలు చారిత్రక నవలలను విరివిగా ముద్రించి పాఠకుల్లో పఠనాశక్తినీ, పఠనాసక్తినీ ఇనుమడింప జేశాయి.


చారిత్రక నవలలవు వస్తువు రీత్యా పలురకాలుగా విభజింపవచ్చు. భారతదేశ చరిత్రను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు, ఆంధ్రుల చరిత్రను ఇతివృత్తంగా చేసుకొని వచ్చిన నవలలు కవులను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు మత ప్రవర్తలను ఆధారంగా చేసుకొని వచ్చిన నవలలు, ఇలా పలు రకాలుగా విభజించవచ్చు.
1. భారత చరిత్రను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు. భారతదేశ చరిత్రలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని మన తెలుగు రచయితలు ఎన్నో నవలలు రాశారు. మరెన్నింటినో ఇతర భాషల నుంచి అనువదించారు. 'చంఘీజ్‌ఖాన్‌' అనే చారిత్రక నవలను శ్రీ తెన్నేటి సూరి వ్రాశాడు. ఇది మొదట ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైంది.
13 శతాబ్దాల మధ్యగల ఆసియా ఖండ చరిత్రలో గర్వకారకుడైన మహాపురుషుడు చంఘీజ్‌ఖాన్‌ విదేశీ చరిత్రకారులు అతనిని ఒక సైతానుగా, అధికార దుర్మదాంధుడుగాను నియంతగాను నరరూపు రాక్షసునిగాను చిత్రించారు. శ్రీ తెన్నేటి సూరి ఎన్నో శ్రమల కోర్చి యదార్థ చరిత్రను వెలికితీసి, ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలను అపోశనపట్టి ఎంతో దక్షతతో ఈ నవలను తీర్చిదిద్దారు. ఆయనకు గల పరిపాలనా దక్షతను, శక్తి సామర్థ్యాలను, తనకింది అధికారుల పట్ల చూపిన ప్రేమాదరాలను చక్కగా వివరించారు.
వంగ భాషలో శ్రీ ధీరేంద్రనాథ్‌పాల్‌ వ్రాసిన నవలను శ్రీ మొసలి కంటి సంజీవరావు మొగలాయి దర్బారు పేరున నాలుగు భాగాలలో తెలుగులోకి అనువదించారు. ఈ నవలలో మొగలాయి రాజ్యంలోని నిరంకుశ విధానం, భోగలాలసత స్వార్థపర్వతం కన్నులకు కట్టినట్లు వర్ణించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ వ్రాసిన 'జయ¸°ధేయ' అనే నవలను శ్రీ ఆలూరి భుజంగరావు ఆంధ్రీకరించాడు. ఇందులో 350 400 కాలం నాటి భారత రాజకీయ సామాజిక స్థితిగతులు చిత్రించబడ్డాయి. బకించంద్ర చటర్జీ వ్రాసిన 'సీతారామ' నవలను శ్రీ వెంకట పార్వతీశ్వర కవులు 'సీతారామ రాయలు' అన్న పేరున తెనిగించారు. ఇది ఢిల్లీ చక్రవర్తియైన అక్బరు పాదుషా సన్నిధిలోని ఒక సీతారామ అనే పేరుని గాధ. బకించంద్ర మరో నవల 'కపాల కుండలను' కూడా వెంకట పార్వతీశ్వర కవులే ఆంధ్రీకరించారు. అక్బర్‌, జహంగీర్‌ కాలం నాటి పరిస్థితులు ఇదులో వర్ణించారు. ప్రధానంగా వీరు 'ఏకాంతసేవ' వంటి భావగీతాలు వ్రాసినా ప్రమధావనము వంటి చారిత్రక అనువాద నవలలు కూడా వ్రాసి సుప్రసిద్ధులైనారు.
జహంగీర్‌ నూర్జహాన్‌ల ప్రేమోదంతాలను శ్రీ యన్‌ రామ చంద్ర నూర్జహాన్‌ అనే నవలలో చిత్రించారు. 'మధురా విజయ' మనే నామంతరం గల వీరకంపరాయలు అనే నవలను శ్రీ వేలమూరి ప్రసాదరావు రచించారు.
కీ||శే|| వేలాల సుబ్బారావు రచించిన రాణీ సంయుక్త నవలకు ఆఫ్‌ఘనుల భారతదేశ దండయాత్ర కథావస్తువు. పృథ్వీరాజు కాలంలో అటువంటి దండయాత్ర మూలంగా భారతదేశ స్వాతంత్య్రం ఎట్లా నశించింది. అన్న విషయాన్ని వర్ణించాడు.
మెడోస్‌ టెయిలర్‌ అనే ఆంగ్ల రచయిత టిప్పుసుల్తాన్‌ అనే నవలను ఆంగ్లంలో వ్రాశాడు. దీనిని అదే పేరుతో కీ||శే|| అక్కిరాజు ఉమాకాంత కవిశేఖరులు తెలుగులోకి అనువదించారు. ప్రసిద్ధ వీరుడు టిప్పుసుల్తాన్‌ జీవితానికి సంబంధించింది ఇందులో కథ. ఈ నవలలో అప్పటి హిందూ మహమ్మదీయ మతాల మధ్య సంబంధాలేగాక భారతీయుల సాంఘిక రాజకీయ వ్యవహారాల కూడా వర్ణించబడ్డాయి. ఈ విధంగా భారత చరిత్రను ఆధారంగా చేసుకొని ఎన్నో చారిత్క నవలలు తెలుగులో వచ్చాయి. 2. ఆంధ్రుల చరిత్రను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు.
ఆంధ్రుల చరిత్రను ఆధారంగా చేసుకొని కూడా అనేక నవలలు తెలుగులో వచ్చాయి. ఆంధ్రప్రదేశ చరిత్రకు సంబంధించిన కథలలో శాతవాహనుల నాటి కథను తీసుకొని 'హిమబిందు' అనే నవలను అడవి బాపిరాజుగారు వ్రాశారు. శాతవాహనుల చరిత్రనే ఆధారంగా చేసుకొని ఇంకా ఎన్నో నవలలు వచ్చాయి. శాతవాహన రాజులపై పరిశోధించి లేదు. నవలలు ప్రకటించారు. శాతవాహన చక్రవర్తి అయిన మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానీక వైవాహిక వృత్తాంతాన్ని ఆ'నాగానిక' నవలగాను హల వీలావతుల కళ్యాణగాథను వసంతగౌతమి గాను రచించాను. నాకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన 'శ్రీలేఖ' శాతవాహనుల సామ్రాజ్యస్థాపన నాటి స్థితి గతులను కళ్లకు కట్టినట్లు వర్ణించే ఈ నవల ఎందరో పండితుల ప్రశంసలకు పాత్రమైంది. కుహనా ప్రణయాలపై ఆధారపడి రచించే నిర్జీవ రచనలతో విసిగిపోయిన పాఠకులకు శ్రీలేఖ చైతన్యపు రాక అని స్వర్గీయ దాశరథి ప్రశంసించారు. మీ శ్రీలేఖచదువుతుంటె విశ్వనాథవారు, బాపిరాజు గారు లేనివోటు ఆంధ్రశారదకు మీరు కనిపించనీయలేదని ఆచార్యపాటిలు తిమ్మారెడ్డి అభినందించారు. శ్రీలేఖ 1980 వ సంవత్సరంలో వ్రాయబడింది. 1983 లో నాగానిక ఆవిష్కరిస్తూ శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన ఒక సభలో ''చారిత్రక నవలా చక్రవర్తి''గా పెద్దలు అభివర్ణించారు. నిబద్ధత కల పరిపూర్ణచారిత్రక నవలా రచయితగా నన్ను సి.నా.రె. ప్రస్తుతించారు. విజ్ఞాన సర్వస్వం (మాగ్నం అపస్‌) అని చెప్పదగిన నవల ''ఆచార్య నాగార్జున'' బౌద్ధయుగానికి చెందిన నవల శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు కాకతీయుల గాధను ఆధారంగా చేసుకొని ''రుద్రమ దేవి'' నవలను వ్రాశారు. మరో ఆరు చారిత్రక నవలలు వీరి ప్రసిద్ధములు.
చారిత్రక నవలా మార్గంలో విశ్వనాథ వారిది ఒక విశిష్టమైన శైలిగా చెప్పవచ్చు. వీరు తెలుగుదేశ చరిత్రలోని కథలను తీసుకొని ఎన్నో నవలలు వ్రాశారు. 'ఏకవీర' వాటన్నిటివో ఉత్తమమైన నవలగా చెప్పవచ్చు. ఇది మధురనాయక రాజుల కాలాన్ని ఇతివృత్తంగా చేసుకొని రచించిన కాల్పానిక చారిత్రక నవల. దీనిని ఇంగ్లీషులో 'రొమాంటిక్‌ హిస్టారికల్‌ నవల అంటారు. ఇది 1925 లో వ్రాయబడింది. ఈ నవల చరిత్రలోని కథను అనుసరించి, దానికి లోబడి కథాకథనానికి తోడ్పడి, చరిత్రకు నవలకు గల సంబంధాన్ని నిపుణతతో ప్రదర్శించారు. ధర్మానికి, ప్రేమకు మధ్య ఉత్పన్నమైన సంఘర్షణ దీనిలో ప్రధాన ఇతి వృత్తం. విశ్వనాథ వారి మరో నవల 'బద్దన్న సేనాని (1938)కి వేంగీ చాళుక్య ప్రభువుల కథ ఇతివృత్తం. విశ్వనాథ వారే 1946 లో పల్లవ కదంబులకు చెందిన కథను ఇతివృత్తంగా గ్రహించి 'కడిమి చెట్టు' అనే నవలను విజయపురి నేలిక ఇక్ష్వాకు వంశ ప్రభువుల చరిత్రను ఆలంబనగా చేసుకొని 'ధర్మచక్రము (1947) అనే నవలలను వ్రాశారు. పై నవలలన్నీ ఆంధ్రేతి హాసానికి సంబంధించినవే. దీనిని బట్టి ఆయనకు ఆంధ్ర చరిత్ర పట్ల ఉన్న అభిమానం తెలుస్తుంది.
అడవి బాపిరాజు గారు కాకతీయ సామ్రాజ్యాన్ని ఆలంబనగా చేసుకొని 'గోనగన్నారెడ్డి' అన్న నవలను వ్రాశారు. పశ్చిమాంధ్ర భూభాగాన్నంతటిని సమర్దతతో ఏలిన మాండలిక ప్రభువు గోనగన్నారెడ్డి కాకతీయ సామ్రాజ్యాన్ని కబళించడానికి మహారాష్ట్రులు ప్రయత్నించినప్పుడు ప్రభుశక్తి పరాయణుడైన గొన్నారెడ్డి వారికి ఎదురొడ్డి నిలిచి తన భుజ బలంతో బుద్ది వైభవంతో రాజనీతి చతురతతో ఓడించి తమ ప్రభువు రుద్రమ దేవికి విజయం చేకూర్చడం దీనిలోని ప్రధానాంశం. శ్రీ కొండూరు వీర రాఘవ చార్యులు మోహనాంగి అనే ఒక గొప్ప నవలను వ్రాశారు. శ్రీకృష్ణ దేవరాయల పట్టమహిషి తిరుమల దేవికి జన్మించిన కూతురే మోహనాంగి. ఈమె కథ ఈ నవలకు ఇతివృత్తం.


మల్లాది వసుందరగారి తంజావూరు పతనం నవలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం బహుమతి లభించింది. వీరే సప్తవర్ణి, రామప్పగుడి కూడా వ్రాశారు. నా ఆవాహన నవల కాకతీయుల శిల్పకళ ప్రాభవానికి అద్దం పట్టింది. ఇది 1974 లో వ్రాయబడింది. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్ధుడైన రఘునాథ భూపాలుని చరిత్రను తంజావూరు విజయంగా 1980 లో రచించాను. తంజావూరు విజయం ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు కొంతకాలం క్రితం ఉపవాచకంగా కూడా ఉండేది.
ఏ నవలలోనైనా నైతిక విలువల పతనం, ఒకనాటి భారత దేశ సుస్థితి, వైభవాలు చిత్రీకరించడం నా లక్ష్యం. ఆంధ్ర విశ్వవిద్యాలయం చారిత్రక నవలల పోటీలు పెట్టినప్పుడు శ్రీ దూళిపాళ శ్రీరామమూర్తి “భువన విజయం కొర్లపాటి శ్రీరామ మూర్తిగారి చిత్రకళ నవలలకు బహుమతులు వచ్చాయి.
3. కవులను ఆలంబనగా చేసుకొని వచ్చిన నవలలు. చారిత్రక నవల అటే చరిత్రలో జరిగిన సంఘటనను గాని ఒక రాజును గాని ఒకరాణిని గాని తీసుకొని దాని చుట్టూ కథను అల్లడం. ఆ రాజులకు తోడ్పడిన మంత్రులను, సేనాపతులను మహా వీరులుగా చేసి వారి చుట్టూ కథలను అల్లడం ఒక సంప్రదాయ బద్ధమైన ఆచారం.
శ్రీనోరి నరసింహ శాస్త్రి గారు దీనిని త్రోసిరాజని తన నవలల్లో ఆయా కాలాల్లో వర్థిల్లిన మహా కవులకు ప్రాధాన్యమిచ్చి వారి చుట్టూ కథను నడిపాడు. ఈ విధంగా శ్రీనోరి నరసింహశాస్త్రి గారు తర్వాతి కవులకు మార్గదర్శకులయ్యారు. చరిత్రలో కొంతమంది మహాకవుల వల్లనే చిన్న చిన్న రాజ్యాలు సైత్యం ప్రసిద్ధి చెందాయి. నన్నయ మహాకవి వల్ల రాజ రాజ తిక్కన మహా కవి వల్ల “మనుమసిద్ధి’ ప్రభువునకు చరిత్రలో విలువ వచ్చింది. అలాంటి మహాకవులపై నవలలు వ్రాయడం శుభపరిణామంగా భావించవచ్చు. శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు “నారాయణభట్టు’ (చాళుక్య వంశం) మల్లారెడ్డి (రెడ్డిరజ్యం) కవిసార్వభౌముడు (పేదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి) ధూర్జటి (కృష్ణదేవరాయల యుగం) వంటి సరికొత్త చారిత్రక నవలలను వ్రాశారు. వీరి మల్లారెడ్డి నవలకు ఇతి వృత్తంగా కవిత్రయంలో మూడవ వాడైన ఎఱ్ఱాప్రగడను తీసుకున్నారు. కవి సార్వభౌముడులో శ్రీనాథ కవి సార్వభౌముని జీవితం ఆయన సలిపిన సాహిత్య జైత్రయాత్రలు చక్కగా వర్ణితమైనాయి. “రంగాజమ్మ’ అనే చారిత్రక నవల తంజావూరు కాలం నాటి కథ వ్రాశారు. తిక్కన సోమయాజి అనే నవలను శ్రీ తుమ్మల పల్లి రామలింగేశ్వరరావు రచించాడు. ఆచార్య డాక్టర్‌ కె.వి.ఆర్‌. నరసింహం వ్రాసిన “కనకాభిషేకం’ నవలలో శ్రీనాథుడు ప్రౌడదేవరాయల సభలో డిండిమభట్టును ఓడించి కనకాభిషేక సత్కారం పొందిన విషయం తదనంతర పరిస్థితులు వర్ణించడం జరిగింది.
నా రచనలు వసంత గౌతమి. ఆచార్య నాగార్జున, ఆవాహన, పద కవితా పితామహుడు అన్నమాచార్యుల జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని శ్రీ పదార్చన అన్న నవలను వ్రాశాను. ఈ నవలను తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలగా గుర్తించింది. ఒకేసారి శ్రీపదార్చన నవలను లక్షప్రతులు ముద్రించి తెలుగు నవలా చరిత్రలోనే సంచలనం సృష్టించారు. దీనిని బట్టి ఆ నవలకు ఎంతగా ప్రజాస్పందన లభించిందో అర్థమవుతుంది. తంజావూరు విజయం ఇంటర్‌ మీడియట్‌ పాఱ్య గ్రంధం.
4. మతం మత ప్రవక్తలను ఆధారంగా చేసుకొని వచ్చిన నవలలు. భారతదేశ ప్రజలపై మత ప్రభావం ఇంతా అంతా అని చెప్పలేము. ముఖ్యంగా తెలుగు ప్రజలపై మత ప్రభావం మిక్కుటంగా ఉంది. ఈనాటికి మత ప్రవక్తలను ఈ దేశంలో దేవుళ్లుగా కొలుస్తున్నారు. కనుక మతం మత ప్రవక్తలను ఆధారంగా చేసుకొని తెలుగులో సహజంగానే ఎన్నో నవలలు వచ్చాయి. ఉత్పల సత్యనారాయణం గారి “”రాజమాత’’ ఇతి హసిక నవలా ప్రక్రియ కిందికి వస్తుంది. అలాంటిదే జి.వి. పూర్ణచంద్‌ గారి నవల కూడా. శ్రీమతి తెన్నేటి హేమలత రామాయణం ఆధారంగా ఒక నవల వ్రాశారు. మాదిరెడ్డి సులోచన ఒక చారిత్రక నవల వ్రాసింది. కాని దానికి అంతగా ప్రసిద్ధి రాలేదు.
విశిష్టాద్వైత మత స్థాపకుడైన శ్రీ రామానుజాచార్యులు తన మత స్థాపనకు చేసిన ప్రయత్నాలు, తత్ఫలితంగా ఆయన పడిన కష్టాలను రామానుజుని ప్రతిజ్ఞ అనే నవలలో పి. రాజగోపాల నాయుడు యుక్తియుక్తంగా వివరించారు. అడవి బాపిరాజుగారు అడవి శాంతిశ్రీ నవలలో వైదిక బౌద్ధ మతాల మధ్య జరిగిన సంఘర్షణలను చిత్రించారు. పాత్రలను చారిత్రక పరిస్థితులకనుగుణ్యంగా మలచడంలో వర్ణనలు చేయడంలో సంభాషణలు నడపడంలో ఆయనకు ఆయనే సాటి. పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ “ద్రౌపది’ సత్యభామ రచించారు.
కళ్యాణి చాళుక్యరాజైన బిజ్జలుని వద్ద మంత్రిగా పనిచేసి వీరశైవ మతాన్ని ఝంఝామారుతంలా వ్యాపింపజేసిన బసవేశ్వరుని, జీవిత చరిత్రను “అనుభవ మంటపం’ పేర నేను నవలగా మలిచాను. ఈ విధంగా అడవి బాపిరాజు, విశ్వనాథ, నోరి నరసింహ శాస్త్రుల తరువాత మళ్లీ చారిత్రక నవలా మార్గాన్ని స్వీకరించి దీన్నొక ఉద్యమంగా చేసుకొని ఉత్తమమైన చారిత్రక నవలలందించడంలో సంపూర్ణంగా కృతకృత్యుడనైనాను. ఏ కాలం ఇతివృత్తం గ్రహించినా దానికి సంబంధించిన సకల చారిత్రక గ్రంథాలు పరిశీలించి అవసరమైనంత వరకే కల్పనలు జోడించి ప్రణాళికా బద్ధంగా నవలలు వ్రాయడం నా పద్ధతి. రెసిడెన్సీ, అసఫ్‌ జాహిల కాలం గుణాడ్యుని బృహత్కథను ఆధారంగా చేసుకొన్న ఎపిక్‌ నావెల్‌ తెలుగు చారిత్రక నవలకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని కల్పించడం నా లక్ష్యం. ఆధునికోత్తర చారిత్రక నవల (1980 తర్వాత) నాగపూర్ణిమ, నా విధ్యాధర చక్రవర్తి, వసంత గౌతమి, అల్లాడ నారాయణరావు “”రుచీదేవి’’ (విజయ నగర రాజుల కాలం నాటి కథ) శ్రీకృష్ణ దేవరాయులు శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు. కీ||శే|| శ్రీమతి ఓగేటి ఇందిరా దేవి రుద్రమదేవి. కోటలో నారాజు, యుగాది శ్రీమతి పాలంకి సత్య (12 వ శతాబ్ది నాటి ఖుజరహ: ఆంధ్రభూమి సీరియల్‌ ఇలా అక్కడక్కడ కొన్ని వస్తున్నాయి. పఠనాసక్తి తగ్గటంతో చారిత్రక నవల వ్రాయడానికి రచయిత భయపడుతున్నారు. అయినా ఈ యాగం యోగం అవిచ్ఛిన్న జాహ్నవిలా సాగుతూనే ఉంటుంది

No comments:

Post a Comment