Saturday, September 18, 2010

తొలి ప్రబంధం

పదహారవ శతాబ్దం నాటి రాయలకాలాన్ని విమర్శకులు ప్రక్రియాపరంగా ‘ప్రబంధయుగం’ అన్నారు. రాయలకాలంలో వెలువడిన వాటికే ప్రబంధాలనే పేరు వచ్చింది. రాయలు రాసిన ‘ఆముక్తమాల్యద’ కూడా ప్రబంధం అన్నారు. నిజానికి ఇది ఆధునిక విమర్శకుల సృష్టితప్ప వేరొకటి కాదు. తిక్కన తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నాడు. ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనే బిరుదు వుంది. అవచి తిప్పయసెట్టి శైవ ప్రబంధం రాయమంటే
శ్రీనాధుడు ‘హరవిలాసం’ రాశాడు. దండి కావ్యానికి చెప్పిన అష్టాదశ వర్ణనలే ప్రబంధానికి ఉంటున్నాయి. కాబట్టి పూర్వం ప్రబంధ శబ్దం మంచి రచన, మంచి కూర్పుకలది, కావ్యం, కృతి అనే అర్ధాలలోనే వాడబడింది. ఇప్పటికీ మనుచరిత్ర కావ్యం, ఆముక్తమాల్యద కావ్యం అనే అంటున్నాం కదా! ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య కె.వి.ఆర్.నరసింహం, ఆచార్య పల్లా దుర్గయ్య, ఆచార్య దివాకర్ల వేంకటావధాని మొదలైనవారు ప్రబంధ లక్షణాలు తెలిపి కావ్యంకన్నా ప్రబంధం భిన్నమైందని నిర్ధారించారు. మరి తొలి ప్రబంధమేది? అనే అంశంపై మళ్లీ వాదోపవాదాలు బయలుదేరాయి. కొంతమంది నన్నెచోడుని ‘కుమార సంభవం’ తొలి ప్రబంధమన్నారు. దానికి కారణం వర్ణనలు, కథా నిర్వహణ శిల్పం, ఉక్తి వైచిత్రి వంటి లక్షణాలే. అయితే మరి కొందరు దీనిని అంగీకరించలేదు. ప్రబంధం అనువాదం కాకూడదు, శృంగారం ప్రధానంగా వుండాలి... అని చెప్పినవి పూర్తిగా కుమారసంభవానికి అన్వయించడంలేదు. కాళిదాసు కుమారసంభవంనుంచి కొన్ని అనువాదాలుండడం గమనార్హం. ఎఱ్ఱనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు అతని వర్ణనా నైపుణ్యం వల్లనే వచ్చింది కాబట్టి అతని నృసింహ పురాణం, హరివంశాలు అనువాదాలు కావడంవల్ల కావ్యాలుగానే పరిగణిస్తున్నారు. పురాణాలు అరణ్యాలవంటివైతే ప్రబంధాలు తీర్చిదిద్దిన ఉద్యానవనములవంటివి-అన్న వేటూరి ప్రభాకరశాస్ర్తీగారి మాటలు సమంజసాలు.ఆ కోణంనుంచి చూస్తే అల్లసాని పెద్దన రాసిన ‘మనుచరిత్ర’ తొలి ప్రబంధనమనటం సముచితం. ప్రబంధ లక్షణాలన్నీ మనుచరిత్రకి అన్వయించకపోయినా (చాలా ప్రబంధాలకి అన్ని లక్షణాలు వర్తించవు) రసానందం, చమత్కారత్వం వంటివి పుష్కలంగా గలది మనుచరిత్ర. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం కూడా ప్రబంధ యుగంలో పెద్దన ఒక మేరుపర్వతం వంటివాడనీ, ప్రబంధ ధ్వని ప్రతీయమానమయ్యేట్టు కథా సంవిధానం చేశాడనీ పేర్కొన్నారు. ఆరుద్ర ప్రబంధ వృక్షానికి ఎన్ని కాయలు కాసినా-తొలి ఫలం మనుచరిత్ర అన్నారు. అంతకు ముందు కల కావ్యాలలో ప్రబంధ పోకడలు వున్నాయి. ప్రబంధ మార్గానికి స్పూర్తినిచ్చాయి. ప్రబంధం అనగానే మనుచరిత్ర,పెద్దన గుర్తుకురావాల్సిందే! కాబట్టి ఎక్కువమంది మనుచరిత్రనే తొలి ప్రబంధంగా నిర్ణయించారు

No comments:

Post a Comment