Monday, September 20, 2010

తొలి కావ్యం

సంస్కృతంలో కావ్యానికి చెప్పబడిన లక్షణాలనే తెలుగుకి అన్వయించి కావ్యం, ప్రబంధం అన్నారు. ఆ తర్వాత ప్రబంధం వేరుగా ప్రత్యేక లక్షణాలు చెప్పారు. నన్నయ రాసిన మహాభారతాన్ని కొంతమంది కావ్యేతిహాసమంటే, కొద్దిమంది కావ్యమే అన్నారు. కావ్య లక్షణాలు సంపూర్ణంగా మొట్టమొదటగా ననె్న చోడుడు రాసిన ‘కుమార సంభవం’లోనే కనబడతాయి. ‘వర్ణనాష్టాదశంబుచే పరిపూర్ణంబై, దశప్రాణంబుల సప్రాణంబై, నవరస భావ భరితంబై, షట్త్రింశదలంకారాలంకృతంబ’గుటచేతనే ‘‘రమణీయంబగు దివ్య కావ్య రచనారంభంబునకు అభిముఖుడైనట్లు’’ నన్నె చోడుడు చెప్పుకున్నాడు. ‘సకలావయవంబలంపరిపూర్ణంబైన దివ్య కావ్యంగనా సృష్టి’గా కుమార సంభవాన్ని పేర్కొన్నాడు. ‘కుమార సంభవం’ కావ్యాన్ని కనుక్కొని, పరిష్కరించి అజ్ఞాత వాసంనుంచి బయటకు తీసుకువచ్చి ప్రచురించిన ఖ్యాతి మానవల్లి రామకృష్ణ కవికి చెందుతుంది. 1909లో మొదట ప్రకటించినప్పుడు నన్నయకంటే నన్నెచోడుడు ముందటి వాడన్న చర్చ జరిగింది. ఆ తర్వాత నన్నెచోడుడు రాయలేదు-మానవల్లి రామకృష్ణ కవి రాసి ననె్నచోడుని పేరు పెట్టారని కొర్లపాటి శ్రీరామమూర్తిగారు పుస్తకం రాసినా చాలామంది ఆమోదించలేదు. ననె్నచోడునికి ‘కవిరాజ శిఖామణి’ అనే బిరుదువుంది.
‘‘మునుమార్గ కవిత లోకంబున
వెలయగ దేశికవిత పుట్టించి తెనుం
గును నిలిపి రంధ్ర విషయంబున జన
చాళుక్యరాజు మొదలుగ పలువుర్’’ అనడమే కాకుండా ‘‘మార్గకుమార్గము దేశియమార్గము’’ అని మొట్టమొదగా మార్గ, దేశి కవిత్వాలను ప్రస్తావించాడు. జాను తెనుగుకి ప్రాధాన్యమిస్తానన్నాడు. తనది వస్తుకవితగా అభివర్ణించుకున్నాడు. శివపార్వతుల కల్యాణం-వారికి కుమారస్వామి జన్మించడం ఈ కావ్యంలోని ఇతివృత్తం. నన్నె చోడుడు శివకవే కానీ పాల్కురికి సోమనలాగా వీరశైవ కవి కాదు. కొందరి దృష్టిలో ఈ కుమార సంభవం ప్రథమ ప్రబంధం కూడా!
మత్త్భాలను వర్ణించేటప్పుడు ‘మత్త్భేవిక్రీడితం’ ఛందస్సును, వసంత సమయంలో ‘మత్తకోకిల’ ఛందస్సును, శివునికి స్వాగతం చెప్పేటప్పుడు ‘స్వాగత’ ఛందస్సును...ప్రయోగించి ఆయా వృత్తాలకు నామ సార్ధక్యం కల్పించడం ఒక విశేషమైతే-మొదటగా గర్భ బంధ చిత్ర కవితను ప్రవేశపెట్టడం మరో విశేషం. ‘‘శ్రీమజ్జంగమ మల్లికార్జున దేవ దివ్య శ్రీపాద పంకజ భ్రమరాయమాణ కవిరాజ శిఖామణి’’ రాసిన ఈ కావ్యం తెలుగులో విశిష్టమైనది. దేశీయతకు పెద్దపీట వేసిన తొలి కావ్యమిది.

No comments:

Post a Comment