Monday, September 13, 2010

తెలుగు భాసః ప్రాచీనత

కన్నడకె హోరాడు కన్నడద కంద
కన్నడవ కాపాడు నన్న ఆనంద
జోగుళద హరకెయిదు మరెయదిరు చిన్న
మరెతెయాదరె నీను మరెతంతె నన్న
మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషను అభిమానించడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం ఉందని అందరం ఒప్పుకుంటాం. అయితే “మాతృభాష గురించి మరచిపోతే కన్నతల్లిని మరచిపోయినట్టే”నని చెబుతున్న పై కన్నడ జోలపాట వంటి కవితలు మన తెలుగులో తక్కువేనని చెప్పవచ్చు. అందుకు సమాధానంగా మన భాష పట్ల మనకు అభిమానమే కాని తమిళ, కన్నడ సోదరులవలె దురభిమానం లేదని నిగర్వంగా చెప్పుకుంటాం. కానీ, తెలుగు ప్రాచీనతకు సంబంధించి గత రెండుసంవత్సరాలుగా వస్తున్న అశాస్త్రీయ సిద్ధాంతాలు, వాటికి తెలుగు పత్రికల్లోనూ, సాహితీ సదస్సుల్లోనూ, తెలుగు మహాసభల్లోనూ కలుగుతున్న ప్రచారం, ఆదరణ చూస్తే భాషా దురభిమానంలో మనం మన పక్క రాష్ట్రాల వారిని మించిపోతున్నట్టనిపిస్తుంది. ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.
తెలుగు వారి గతాన్ని సుమేరియన్ల నుండి అమెరికన్ల వరకు ఆపాదిస్తూ సిద్ధాంతాలు చేస్తున్న వారిలో ప్రముఖులు: సంయుక్త కూనయ్య, జీ. వీ. పూర్ణచంద్ గార్లు. అర్ధ సత్యాలను, అభూత కల్పనలను అత్యంత తాజా పరిశోధనల సారాంశంగా, తెలుగు ప్రాచీనతను నిరూపించే సిద్ధాంతాలుగా ఇంటర్‌నెట్ లోనూ, తెలుగు పత్రికల్లోను కనిపించే వీరి రచనలు శాస్త్ర దృష్టితో పరిశీలించేవారికి నిరాశనే మిగిలిస్తాయని చెప్పాలి. తెలుగు భాషను హరప్పా, ఈజిప్టు, సుమేరియన్‌, ఈలమ్‌ నాగరికతల భాషలతో పాటు ప్రాచీన అమెరికన్‌ రెడిండియన్ల భాషల తోనూ, ఇటలీలో ఎట్రుస్కన్‌, కేనరీ దీవుల్లో గువాంచీ, బ్రిటన్‌లో కెల్టులు, క్రేట్‌లో మినోవన్లు, లెబనాన్‌లో ఫినీషియన్లు, మారిటేనియాలో బర్బరుల భాషలతోనూ ముడిపెడుతూ సాగే రచనా ధోరణి తులనాత్మక భాషాశాస్త్రంతో కొద్దిగా పరిచయం ఉన్న వారెవరికైనా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వ్యాసాల్లో అమెరికా అంటే ‘ఆర్‌-మెరక’ (మెరకనేల) అంటూ తెలుగు వ్యుత్పత్తిని ఇవ్వజూపడం, ఆఫ్రికాలోని‌ మండింగ్‌ భాషలలో ‘నత్తరు’ అనే పదం తెలగు ‘ నెత్తురు’ కు సంబంధించిందని వాదించడం నిజంగానే నవ్వు తెప్పించే విషయాలు.
తలలు పండిన భాషావేత్తలు కూడా వ్యాఖ్యానించడానికి సందేహించే మహా భాషాకుటుంబ (Super linguistic family) సిద్ధాంతాలకు భాషాశాస్త్రాన్ని ఇప్పుడిప్పుడే అభ్యసిస్తున్నవారు దూరంగా ఉంటేనే మంచిది. కానీ ఊహాత్మకంగా (speculative) ప్రతిపాదింపబడిన కొన్ని మహా భాషాకుటుంబ సిద్ధాంతాలను పూర్ణచంద్ వంటివారు పూర్తిగా నిరూపింపబడిన సత్యాలుగా ఉటంకించడమే కాక , వాటికి తమ, తమ కల్పనలను జోడించి తమకు తోచిన విధంగా చరిత్రలు రాయబూనడం దుస్సాహసమే అవుతుంది. ఉదాహరణకు, పూర్ణచంద్ విశేషంగా ప్రస్తావించే మాక్‌ఆల్పిన్ ఈలమో-ద్రావిడ మహాకుటుంబ సిద్ధాంతంలోని తీవ్రమైన లోపాలను జ్వలబిల్ , కృష్ణమూర్తి వంటి ప్రముఖ భాషావేత్తలు ఎత్తిచూపారు[1]. పూర్ణచంద్ గారే పేర్కొన్న మరో భాషావేత్త వక్లావ్ బ్లేజక్ (Václav Blažek) కూడా ఈలమో-ద్రావిడ మహాకుటుంబ సిద్ధాంతాన్ని తోసిరాజని, ఈలమో-ఆఫ్రోఏషియాటిక్ మహాకుటుంబ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు[2] . అయితే, ఈ రెండు మహాకుటుంబ సిద్ధాంతాలను అంగీకరించే భాషావేత్తల కంటే విభేదించే భాషావేత్తలే ఎక్కువ[3]. అలాగే జపాన్ భాషకు , తమిళ భాషకు సంబంధాన్ని చూపిస్తూ సుసుము ఓనో (Susumu Ohno) తయారు చేసిన సిద్ధాంతాన్ని వేరే భాషావేత్తలెవరూ పెద్దగా అంగీకరించలేదు[4]. చారిత్రక శకానికి పూర్వమైన (Prehistoric) ఏ సంబంధానికైనా ఆధారాలు తమిళ ధాతువులతో కాక మూల-ద్రావిడ (Proto-Dravidian) ధాతువులతో నిర్మించాలని వారి ప్రధాన ఆక్షేపణ. ప్రపంచంలోని ఇతర భాషా కుటుంబాలకు, సూటిగా తెలుగు భాషతో సంబంధం అంటగడుతూ సంయుక్త కూనయ్య, పూర్ణచంద్ వంటి వారు చేసే సిద్ధాంతాలకు కూడా సరిగ్గా ఇదే అభ్యంతరం వర్తిస్తుందని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
చిత్తశుద్ధితో తులనాత్మక భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేసి, శాస్త్ర ప్రమాణాల గురించి కొంత శిక్షణ పొందడం ద్వారా ఈ రకమైన అపరిపక్వమైన వాదాల ఆకర్షణ నుండి బయటపడవచ్చునని నాకనిపిస్తుంది. భాషాశాస్త్రంలోని మౌలికాంశాలను కొంతైనా లోతుగా అభ్యసించిన వారికి సోదర పద (cognate) నిరూపణకు ‘శబ్ద సామ్యం ‘ కన్నా ధ్వని సూత్ర (sound laws) శీలమైన ‘ధ్వన్యనుగుణ్యత’ (sound correspondence) ముఖ్యమని తెలుస్తుంది; గత రెండు శతాబ్దాలుగా భాషాసంబంధ నిరూపణకు అత్యంత కీలకమైన ఉపకరణంగా వాడుతున్న ‘తులనాత్మక పద్ధతి’ (Comparative Method) గురించి కొంతైనా అవగాహన కలుగుతుంది. భాషాశాస్త్రాన్ని ఒక విజ్ఞానరంగంగా అధ్యయనం చేయడం ద్వారా శాస్త్ర విమర్శకు నిలువలేని వాదాలను పసిగట్టగలిగే నిపుణత కొంత చేకూరుతుంది. సంక్లిష్టమైన పూర్వ చరిత్రల పునర్నిర్మాణానికి చారిత్రక, భాషాత్మక ఆధారాలతో ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, జెనెటిక్స్ మొదలైన ఇతర విజ్ఞాన శాస్త్ర ఆధారాలను అనుసంధానం చేయగలిగే పరిశోధనలు మాత్రమే చిక్కుముడులు విప్పగలవని అర్థమౌతుంది.
పూర్ణచంద్ తదితరులకు తెలుగు ప్రాచీనత గురించి ఉన్నటువంటి తపనా, ఆసక్తీ మెచ్చుకోదగ్గవే అయినప్పటికీ వారు ఉదాహరించే విషయాలు నిష్పాక్షిక శాస్త్రీయ పరిశీలనకు తట్టుకోగలవిగా ఉన్నప్పుడే వారి ప్రయత్నాలు సార్థకం కాగలవు. సహేతుకమైన సిద్ధాంతాలతో, శాస్త్రబద్ధమైన ఆధారాలతోనే తెలుగు భాష మూలాలను వెతికే ప్రయత్నాలకు ప్రోత్సాహం ఇవ్వడం తెలుగు భాషాభిమానులుగా మన అందరి కర్తవ్యం అనేది మరచిపోరాదు.

No comments:

Post a Comment