Monday, February 21, 2011

చిరస్మరణీయుడు : సి.పి.బ్రౌన్

తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్.

1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్

1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఇంగ్లండు నుంచి ఉద్యోగరీత్యా సీపీ బ్రౌన్ తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్‌ తెలుగు అక్షరాభ్యాసం చేశారు.  1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1821లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేశారు. పాఠశా లలో  తెలుగు‌ భాష నేర్పిం చారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు. అక్కడ సైతం తెలుగును అభివృద్ధి చేసేందుకు రెండు పాఠశా లలు ఏర్పాటు చేశారు.  1824లో వెంకటశాస్ర్తి సాయంతో వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన ఘనత సిపిబ్రౌన్‌కు దక్కింది. అనంతరం 1826లో కడప రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు. నిఘంటువును అచ్చువేసేందుకు బోర్డుకు పంపారు.  బోర్డు ఈ నిఘంటువును అచ్చువేయించడానికి తిరస్కరించింది. అనంతరం 1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు.

మచిలీపట్నం జిల్లాకు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాలంలో మచిలీపట్నం కోర్ట్‌లో అమీనుగా ఉంటున్న తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి ద్వారా ద్వారా వేమన ప్రతిని పొంది ఆ తాళపత్ర ప్రతిలోని పద్యాలను కాగితాల మీదకు ఎక్కించాడు. 1825 ఏప్రిల్ 25 నాటికి ఆ పద్యాల చిత్తు పరిష్కరణ, ఆంగ్లీకరణ ముగించాడు. 1825లో ఆయన "విష్ణు పురాణం" చదివాడు. విష్ణు పురాణంలోని అహల్య చరిత్ర ఆయనను అమితంగా ఆకట్టుకుంది. వెంటనే మడికి సింగన ఆ ఘట్టాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వ్రాతప్రతులు పుట్టించడానికి, తీర్పు ప్రతులు సిద్ధపరచడానికి పద సూచికలు వ్రాయడానికి ఆయన కొలువులో ఎప్పుడూ 10 నుంచి 20 దాకా బ్రాహ్మణులు, శూద్రులు ఉండేవారు. ఇంతమంది విద్యావంతులు కృషిచేయబట్టే బ్రౌన్ ఆంధ్ర సాహిత్య సౌధాన్ని రూపొందించగలిగాడు.1837 లో " The Grammar of Telugu Language " అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. 1839లో ఈయన దృష్టి ద్విపద కావ్యాలపై పడింది. తెలుగు గ్రంధాలను సామాన్య కావ్యాలు, మహా కావ్యాలు అని రెండు వర్గాలుగా విభజించవచ్చన్నాడు. రామరాజు భూషణుడు రచించిన "వసుచరిత్ర"ను ఈయన అచ్చువేయించాడు. 1849లో తన స్వంత ఖర్చులతో "ఆముక్త మాల్యద" కు శబ్ద సూచిని తయారుచేయించాడు.

1849లో గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రం మీద నుంచి క్రిందపడి కుడి చేయి బ్రొటన వ్రేలు విరగడంతో బ్రౌన్ ఎడమ చేత్తో రాయడం సాధనచేసి నిఘంటువు ప్రూఫులను ఎడమచేత్తోనే దిద్ది అచ్చెరువొరచాడు. ఈయన మొత్తం 34 సంవత్సరాలపాటు కంపెనీ సర్వీసులో భారతదేశంలో ఉండి 3 దశాబ్దాలపాటు తెసుగు భాషా సరస్వతాలకే తన జీవితాన్ని అంకితం చేశాడు. తెలుగు ప్రజలంతా తనకు చదువు చెప్పిన గురువులే అని ఎంతో వినమ్రంగా చాటిన బ్రౌన్ తెలుగు సాహిత్యం ఉన్నంతవరకూ చిరంజీవిగా వెలుగొందుతాడు.

ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు.

1 comment:

  1. చాలా బావున్నాయి మీ వ్యాసాలూ. బ్రౌన్ గారి గురించి చాలా తెలియని విషయాలు తెలిసాయి ఇది చదివాకా

    ReplyDelete