Friday, October 1, 2010

కర్ణాభిమన్యుల జన్మరహస్యం,ఏకలవ్యుని మరణం ఇతర విశేషాలు



తిహాసం అంటే 'ఇది ఇలాగే జరిగిందని ' అర్థం.పంచమవేదమైన మహాభారతం ఎన్నో అద్భుతమైన గాథలకు మారుపేరు.భారతంలో లేనిది ఎక్కడా లేదు,ఎప్పుడూ జరుగబోదు కూడా.పూర్వం దేవలోకంలో నాలుగువేదాలని ఒక వైపు,మహాభారతాన్ని ఒక వైపు వేసి తూస్తే,త్రాసు భారతం వైపే మొగ్గిందట.అటువంటి మహోన్నతమైన గ్రంథంలోంచి కొన్ని విశేషాలు ఇక్కడ.

  • మహాభారతం వ్రాయడానికి వేదవ్యాసునికి మూడేళ్ళు పట్టింది.
  • వేదాలను నాలుగు భాగాలుగా విభజించినందువలన వ్యాసునికా పేరు వచ్చింది.ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు(నల్లగా ఉంటాడు,ద్వీపంలో పుట్టినవాడు).
  • అమృతం కోసం గరుత్మంతుడు అమృతభాండం ఉంచిన దర్భలను ఆబగా నాకి పాముల నాలుకలు రెండవుతాయి.
  • యాగశాలకున్న వాస్తుదోషం కారణంగా సర్పయాగం ఆగిపోతుందని యాగారంభానికి ముందే లోహితుడనే వాస్తుశాస్త్ర నిపుణుడు జనమేజయున్ని హెచ్చరిస్తాడు.
  • బ్రాహ్మణులు కల్లు త్రాగరాదని,త్రాగితే నరకప్రాప్తి తథ్యమని శుక్రాచార్యులు శాపమిస్తాడు.
  • కులాంతర వివాహాలు ఆనాడే ఉన్నాయి.యయాతి క్షత్రియుడు.దేవయాని బ్రాహ్మణ కన్య.'బ్రాహ్మణులు క్షత్రియ కన్యలను వివాహమాడవచ్చు కానీ,రాజులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడరాద 'ని యయాతి అంటే శుక్రాచార్యులు అతని సందేహాన్ని తీర్చి వారిద్దరి వివాహానికి ధర్మబద్ధతను కల్పిస్తాడు.
  • శకుంతలకు దుర్వాస మహర్షి శాపమివ్వటం,దుష్యంతుడు ఆమెను మరచిపోవటం, జాలర్లు తెచ్చిన ఉంగరం చూసి అతనికి అంతా గుర్తుకు రావటం..ఇదంతా మహాకవి కాళిదాసు కల్పనా వైచిత్ర్యం.వ్యాస భారతంలో కథ వేరు.అసలు దుర్వాస మహర్షి ప్రస్తావనే లేదు.దుష్యంతుడు ప్రజాపవాదుకి భయపడి నిండు సభలో శకుంతల ఎవరో తెలియనట్లు నటిస్తే,ఆకాశవాణి వారి వివాహాన్ని గురుంచి సభికులందరికీ చెబుతుంది.దుష్యంతుడు అప్పుడు అంగీకరిస్తాడు.
  • దుష్యంతుని కుమారుడు భరతుడు.అతనికి పుట్టిన కొడుకులెవ్వరు ప్రయోజకులు కాకపోవటంతో ,ఆగ్రహించి భరతుడే వారందరినే చంపి,గొప్ప యాగం చేసి,భరధ్వాజుని ద్వారా భూమన్యుడనే కొడుకుని పొందుతాడు.
  • మహాభారతం ఒక విధంగా దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం అనుకోవచ్చు.అమృతం పొందిన దేవతలకు ఎదురొడ్డి నిలువలేక దైత్యులు,దానవులు భూప్రపంచంలో వివిధ రూపాలతో జన్మించి తమ ఆధిక్యాన్ని నిరూపించుకుంటూంటే,దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేసి భూభారం తగ్గించటానికి దేవతలు కూడా మానవజన్మలెత్తుతారు.

    ధృతరాష్ట్రుడు - హంస అనే గంధర్వుడు
    పాండురాజు - వాయుదేవుని అంశ
    కుంతి,మాద్రి -సిద్ధి,ధృతి
    గాంధారి - మతి
    విదురుడు - యమధర్మరాజు
    ద్రోణుడు - బృహస్పతి
    కృపాచార్యుడు - ఏకాదశరుద్రుల అవతారం
    ద్రుపదుడు,విరాటుడు - వాయుదేవుని అంశ

    దుర్యోధనుడు - కలిపురుషుని అంశ
    దుర్యోధనుడి సోదరులు 99 మంది - రాక్షసులు
    శకుని - ద్వాపరయుగాంశ సంభూతుడు
    ఆశ్వత్థామ - రుద్రుడు,యముడు,కామ క్రోధాంశ సంభూతుడు
    శల్యుడు - ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు
    శిఖండి -గుహ్యకుడనే రాక్షసుడు
    ధృష్టద్యుమ్నుడు - ఆగ్ని అంశ
    ద్రౌపది తనయులు - విశ్వులు

    కంసుడు - కాలనేమి అనే రాక్షసుడు
    పదహారువేల మంది గోపికలు - అప్సరసలు
    జరాసంధుడు - దానవులలో మొదటివాడు విప్రచిత్తి
    రుక్మి (రుక్మిణీదేవి అన్న) - క్రోధుని కుమారుడు
    సాత్యకి (శ్రీకృష్ణుని తమ్ముడు)- మరుత్తులు
  • కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు.నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు చేధిస్తారు.మిగిలిన ఒక్క కవచంతో అతను పారిపోయి సూర్యునిలో దాక్కుంటాడు.నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మిస్తారు.
  • కర్ణుడి అసలు పేరు వసుసేనుడు.జన్మతహ వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి చీల్చి ఇంద్రునికి దానం చేస్తాడు కాబట్టి అతనికి కర్ణుడనే పేరు వచ్చింది.దుర్యోధనుని ప్రాపకం పొందేనాటికే అతనికి కవచ కుండలాలు లేవు. దానమిచ్చేశాడు.మన సినిమాలలో,సీరియల్స్ లో దుర్యోధనుడి చెంత వున్న కర్ణున్ని కవచ కుండలాలలో చూపించి,
    యుద్దసమయంలో అతను వాటిని ఇంద్రునికి దానం చేసినట్లు చూపిస్తారు.
  • పెళ్ళికి ముందే గాంధారి శివుని గూర్చి తపస్సు చేసి నూటొక్క పిల్లల్ని కనే వరం పొందుతుంది.
  • గాంధారి, ఆమె చెల్లెళ్ళు పదిమందితో కలిపి ధృతరాష్ట్రునికి వందమంది భార్యలు.
  • అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్ఛస్సు అంశతో జన్మించినవాడు.కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు అతనికి పదహారోయేడు కలిగినవెంటనే తిరిగివచ్చేయాలని షరతు విధిస్తాడు.తత్పలితంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణిస్తాడు.
  • కర్ణుడు సైతం ద్రోణాచార్యుడి వద్ద కొంతకాలం విద్యనభ్యసించాడు.కురుపాండవుల అస్త్రవిద్యాప్రదర్శనం కంటే ముందు అతనెవరో ద్రోణుడికి తెలుసు.
  • ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి పినతండ్రైన దేవశ్రవుని(వసుదేవుని తమ్ముడు)కుమారుడు.క్రోధుని కుమారులలో ఒకరి అంశతో జన్మించినవాడు.జరాసంధుని సైన్యాధిపతైన హిరణ్యధ్వజుడనే నిషాదరాజు ఇతన్ని పెంచుకుంటాడు.శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళుతున్నప్పుడు,అడ్డుపడి జరాసంధుని తరపున పోరాడి అతని చేతిలో ప్రాణాలు కోల్పోతాడు.
  • హిడింబ అసలు పేరు కమలపాలిక.
  • ఘటోత్కచుడికి నెత్తిన జుట్టు లేదు.బోర్లించిన కుండలా బట్టతలతో ఉంటాడు కాబట్టే అతనికా పేరు.