Thursday, September 23, 2010

వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు


  • దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.
  • దశరథుడికి కైకంటే చాలా ఇష్టం.పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి.కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది.రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.
  • దశరథ మహారాజు అశ్వమేధయాగం నిర్వర్తించి తరువాత పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు.ఆ సమయంలో రావణుడు మరొక యజ్ఞదీక్షలో ఉంటాడు.అందుకే దశరథుని యాగాశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తాడు.
  • తన వంశంలో పుట్టినవాడి చేతిలో మరణం తప్పదని ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణున్ని శపిస్తాడు.రాముడు అదే వంశంలో పుడతాడు.
  • రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురిని పన్నెండు నెలలు(మాములుగా అయితే పది నెలలు) మోసి కంటారు కౌసల్య,కైకేయి,సుమిత్ర.
  • బలపరాక్రమాలలో లక్ష్మణుడు రాముని తరువాతివాడు.భరతుడు వయసులో పెద్దవాడైన భుజబలంలో మాత్రం శతృఘ్నుడుకి సముడు .
  • క్షీరసాగరమథనంలో ధన్వంతరి తరువాత ఉద్భవించిన వారు 60కోట్ల మంది అప్సరసలు.వీరిని ఎవ్వరూ వివాహమాడరు.సంచార వృత్తి కలిగివుంటారు.వీరి తర్వాత పుట్టినవి వారుణి(మద్యం),కౌస్తుభం.
  • అహల్య వృత్తాంతం భిన్నంగా ఉంది.అహల్య అంటే ఎటువంటి వంకరలేని అందమైన స్త్రీ.ఆమె భర్త గౌతమ మహర్షి.ఆయన ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం పొందాక,ఆయన్ని పరీక్షించడానికి,నిజంగా కామక్రోధమదమాత్సర్యాలను జయించాడా అని కనుక్కోవడానికి ఇంద్రుడొక పథకం వేస్తాడు.ఆ ప్రకారం గౌతమునిలా వేషం ధరించి అహల్య చెంతకు వస్తాడు.అయితే తన పాతివ్రత్య బలంతో వచ్చినది ఇంద్రుడని గ్రహిస్తుంది అహల్య.ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆమెతో కలవాలన్న తన కోర్కె తెలియజేస్తాడు.ఇక్కడ కలవటం అంటే మోక్షమివ్వటం అని అర్థం.శారీరక కలయిక కాదు.మోక్షమన్న మాటవినగానే క్షణకాలం పాటు ఆలోచిస్తుంది అహల్య.ఆమె మనస్సును క్షణకాలం చంచలం చెయ్యగలిగానే అనుకుని దేవేంద్రుడు నవ్వుతాడు.అహల్యకు అప్పుడు సత్యం బోధపడి 'నువ్వు వెళ్ళిపో' అని వేడుకుంటుంది.ఈ లోగా గౌతముడు అక్కడి వచ్చి పొరబడి,అవేశంతో ఇద్దరినీ శపిస్తాడు.ఆ విధంగా ఆయనకు ఇంద్రపదవి దూరమవుతుంది.ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని గౌతముడు ఆమెను శపిస్తాడు.అంతేకానీ రాయివి కమ్మని శాపం ఇవ్వడు.అలాగే ఇంద్రుడున్ని వృషణహీనుడవుతావని శపిస్తాడు.
  • శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహమాడినప్పుడు మిగతా రాజకుమారులెవ్వరు అక్కడ లేరు.సీత కూడా విజయమాలతో నిల్చొని సిగ్గుపడుతూ సిద్ధంగా లేదు.సీతా స్వయంవరం అంతకు ముందే చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది.ఎంతోమంది ప్రయత్నించి విఫలులయ్యారు.ఇంకొంతమంది యుద్ధానికి వస్తే వారిని జనకుడు ఓడించి పంపాడు.అలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు మిథిలా నగరం వస్తారు.రాముడు ధనువునెక్కుపెట్టి విరిచేస్తాడు.
  • రావణుడు సీతాస్వయంవరానికి రాలేదు.శివధనువును ఎక్కుపెట్టటం అపచారమనే భావంతో అతను మిన్నకుండిపోయాడని తెలుస్తోంది.తన తరువాత మరెవ్వరూ ఆ ధనువును ఎక్కపెట్టరాదనే శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడు.
  • వివాహమయ్యేనాటికి రాముని వయస్సు పన్నెండేళ్ళు.సీత వయసు ఐదేళ్ళు.
  • పరశురామ గర్వభంగం సీతారాములు అయోధ్యకు వెళ్తూండగా మార్గమధ్యంలో జరుగుతుంది.జనకుడి రాజమందిరంలో కాదు.
  • శ్రీరామున్ని వనవాసం చెయ్యమన్నందుకు ఆగ్రహించి లక్ష్మణుడు కానీ,భరతుడు కానీ కైకను వధించటానికి కత్తి దూయరు.లక్ష్మణుడు ఆమె పరోక్షంలో ఆమెను,తండ్రిని నానామాటలంటాడు.భరతుడు తల్లిని మందలిస్తాడు.శతృఘ్నుడు మాత్రం మంధరను పాదతాడనం చేసి,భరతుడు వారిస్తే విడిచిపెడతాడు.
  • వనవాసానికి వెళ్ళేనాటికి సీతారాముల వయస్సు 18,25.
  • దశరథుడు మరణించాక ఆయన దేహాన్ని పన్నెండురోజుల పాటూ తైలద్రోణంలో నిల్వ చేస్తారు.అంత్యక్రియలు చెయ్యడానికి కుమారులెవ్వరు అందుబాటులో లేకపోవటంతో భరత శతృఘ్నులు అయోధ్య వచ్చేవరకు శవం కుళ్ళి
    పోకుండా ఈ ఏర్పాట్లు చేస్తారు.
  • నాస్తికవాదం రామాయణ కాలంలో కూడా ఉంది.రామున్ని అయోధ్యకు రప్పించటానికి భరతుడు సకల పరివారంతో వెళ్ళినప్పుడు జాబాలి అనే దశరథుని మంత్రి 'ఎవరు తండ్రి,ఎవరు తల్లి' అంటూ నాస్తికవాదం చేస్తాడు.దీన్ని శ్రీరాముడు నిరసించి,'మీవంటి వారిని నా తండ్రి ఎలా కొలువులో పెట్టుకున్నారో' అంటాడు.
  • సీతారామలక్ష్మణులు వనవాసంలో మాంసాహారం తిన్నారు.
  • ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ తన గోడు సోదరులైన ఖరదూషణాదులకు విన్నవించుకుంటుంది.ఆగ్రహంతో ససైన్యంగా వచ్చిన వారిని శ్రీరాముడు యమపురికి పంపిస్తాడు.అకంపనుడనే దూత ఈ సంగతంతా రావణుడికి చెప్పి,సీతాదేవి సౌందర్యం గురుంచి వివరించి,రామున్ని నిలువరించాలంటే సీతను అపహరించాలని ఉపాయం ఇస్తాడు.వాడి మాటలు విని రావణుడు వెళ్ళి మారీచున్ని కలుస్తాడు.మారీచుడు అతనికి హితబోధ చేసి పంపించేస్తాడు.శూర్పణఖ లంక వెళ్ళి రావణున్ని రెచ్చగొడుతుంది.
  • జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న లక్ష్మణరేఖ గురుంచి వాల్మీకి రామాయణంలో లేదు.లక్ష్మణుడు అటువంటి రేఖ ఏదీ గీయడు
  • రావణుడు ఎడమచేత్తో సీత జుట్టుపట్టుకొని,కుడి చేత్తో ఆమెను ఎత్తుకొని పిశాచాల్లాంటి గాడిదలు పూంచిన రథంలో ఆమెను కూర్చోబెట్టి లంకకు తీసుకుపోతాడు.
  • రావణుడితో తలపడక ముందే జటాయువు సీతారామలక్ష్మణులకు పరిచయం అవుతాడు.వారు పంచవటికి విచ్చేసినప్పుడు జాటయువు తనను తాను పరిచయం చేసుకుంటాడు.
  • వాలి మహాబలవంతుడు.తనతో యుద్ధానికి సిద్ధపడిన రావణున్ని సైతం ఓడించి పంపిన పరాక్రమశాలి.అతనితో ఎవరు ముఖాముఖి తలపడినా వారి బలంలో సగం వాలికి చెందేటట్లు వరం ఉంది.చెట్టు చాటు నుంచి వాలిని వధించటానికి గల కారణాల్లో ఇదొకటి.
  • కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి(అవతార్ గుర్తొచ్చిందా).అవి ఎక్కడబడితే అక్కడ వాలి విశ్రాంతి తీసుకున్నప్పుడు అపార ప్రాణనష్టం జరుగుతూండటంతో ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించివేస్తాడు.
  • అశోకవనంలో అన్నపానీయాలు ముట్టని సీతాదేవికి రహస్యంగా అమృతం యిస్తూ రక్షిస్తాడు ఇంద్రుడు.
  • రావణుడు మారువేషంలో వచ్చి రాముడికి యుద్ధ ముహూర్తం నిర్ణయించడు.శ్రీరాముడే యుద్ధముహూర్తం నిర్ణయించి లంకకు బయలుదేరుతాడు.
  • యుద్ధారంభానికి ముందే కుంభకర్ణుడు నిండుసభకు వచ్చి రావణుడికి హితబోధ చేస్తాడు.
  • రావణుడి ఉదరంలో అమృతభాండం ఉన్నట్లు,విభీషణుడి సలహాతోనో మరొకరి సలహాతోనో దాన్ని పగలగొట్టి,రావణున్ని సంహరించినట్లు ఇందులో లేదు.అగస్త్య మహర్షి సలహా మేరకు శ్రీరాముడు,సూర్యున్ని ధ్యానించి బాణప్రయోగం చేసి రావణుడి గుండె చీలుస్తాడు.

No comments:

Post a Comment